నిజాం నవాబు రాచరిక, భూస్వాముల దాస్య శృంఖలాలను తెంచుకొని 78 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించుకున్న హైదరాబాద్ సంస్థాన స్వాతంత్య్ర సమరగాథను స్మరించుకుందాం. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న రాగా హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17న దాదాపు ఒక సంవత్సరం తరువాత మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆ నడుమ కాలంలో ప్రజోద్యమం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో ఆంధ్ర మహాసభ ప్రతినిధిగా రావి నారాయణ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధిగా బద్దం ఎల్లారెడ్డి, ఎఐటియుసి ప్రతినిధిగా మగ్దుం మొహియొద్దీన్‌లు 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి
పిలుపునిచ్చారు. నిజాం నవాబుకు, భూస్వాములకు ప్రైవేట్ సైన్యంగా వున్న ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకారులపై ప్రజలు ఎర్రజెండా పట్టుకొని, వారి తుపాకీ గుళ్లకు ఎదురుతిరిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ దళాలు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ దొరల, భూస్వాముల కబంధ హస్తాల నుంచి ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేశాయి. 3 వేల గ్రామాలలో 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన ఘన చరిత్ర ఆ మహత్తర పోరాటానిది. దాదాపు 4,500 మంది యోధులు ప్రాణాలను తెలంగాణ నేల తల్లికి అర్పణ చేసి పోరాట సమిధులై తెలంగాణ నేలను ఎర్ర నేలగా చరిత్రలో శాశ్వతంగా నిలిపారు. ఆ పోరాటాల వారసత్వం, దాని గాథలు నేటికీ ఏ గ్రామం వెళ్ళినా వినబడతాయి. కనబడతాయి.
నిజాం రాచరిక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి, సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్ సైన్యాలు1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ చేరుకోగా నిజాం, పటేల్‌ల మధ్య జరిగిన చీకటి ఒప్పంద ఫలితంగా సెప్టెంబర్ 17న విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు ప్రకటించడం జరిగింది. 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగి రాజభరణాలు పొందాడు. అయితే అప్పటివరకు స్వాతంత్య్రం కోసం ప్రజలను సమాయత్తపరిచి, సంస్థాన విలీన ప్రక్రియను కమ్యూనిస్టులు సులభతరం చేశారు. కమ్యూనిస్టులు పేదలకు పంచిన 10 లక్షల ఎకరాల భూములను భూస్వాములకు తిరిగి అప్పజెప్పడానికి నాటి ప్రభుత్వం పూనుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. చివరకు పలు కోణాలలో చర్చించి 1951 మేలో అప్పజెప్పడాన్ని విరమించింది.
తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం సబబు కాదు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి, నేడు కర్నాటకలో భాగమైన కల్యాణ కర్నాటక, మరఠ్వాడా ప్రాంతాలలో హైదరాబాద్ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలే ఎప్పటినుంచో అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తి పోసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 సంవత్సరం నుంచి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. పాత ప్రభుత్వం పెట్టిన పేరును మార్చి, కనీసం తెలంగాణ వీరోచిత పోరును స్ఫురించేవిధంగా కాకుండా తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవం అనే పేరుతోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. నాటి హైద రాబాద్ సంస్థానంలోని కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్న నేటి కర్నాటక, మహారాష్ట్రలలో విలీన దినోత్సవంగా నిర్వహిస్తుండగా లేని అభ్యంతరం తెలంగాణలో అదే పేరుతో నిర్వహించడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతున్నది? సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడమే నాటి యోధులకు అసలైన నివాళి.
అది హిందూ, ముస్లిం పోరాటం కానే కాదు
హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దాదాపు 90 శాతం హిందువులే. విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఇంకా అనేక సంస్థానాధిపతులు హిందువులే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా చిత్రహింసలకు గురయ్యారు. ప్రఖ్యాత జర్నలిస్టు షోయబుల్లాఖాన్‌ను హైదరాబాద్ నడిబజారులో రజాకార్లు క్రూరంగా చంపారు. ఈనాటి ఖమ్మం జిల్లా ఆనాటి వరంగల్ జిల్లాలో రజబ్ ఆలి లాంటి యోధులు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. డాక్టర్ రాజ్‌బహుదూర్ గౌర్ తో కలిసి మఖ్దూం మొహియొద్దీన్, ప్రొ. ఆలంకుంద్ మిరి, జవ్వాద్ రజ్వీ,(సాలార్‌జంగ్ మ్యూజియం ఆనాటి లైబ్రేరియన్) ప్రొ. ఖయ్యూం ఖాన్ లాంటి అనేకమంది ముస్లిం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇలా ఎంతోమంది ముస్లింలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. నిజాంను గద్దె దించడంలో మతాలకు అతీతంగా హిందువులతో సహా వీరోచిత పాత్ర పోషించిన ముస్లింలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు.
పోరాటాలు లేకుండా విలీనం జరిగేదా?
ఆనాటి తెలంగాణ పోరాటంలో, అలాగే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ పోరాటంలో తమ పాత్ర లేదని ఒప్పుకుంటూనే గత పోరాటాన్ని స్మరించుకోవడం తప్పుకాదని విచిత్ర వాదనలు తీసుకొస్తున్నారు. ఆనాటి కమ్యూనిస్టులు త్యాగాలు, పోరాటాలు లేకుండా విలీనం జరిగేదా? ఆనాటి విలీనం లేకుండా నేటి తెలంగాణ ఉండేదా? నిజంగా వారిలో చిత్తశుద్ధి ఉండి ఉంటే గతంలో బీజేపీ హయాంలో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదు? (గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు యోధులను అప్పటి కేంద్రం ప్రభుత్వం గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నలమల్ల గిరిప్రసాద్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసి వేలాది మందికి పెన్షన్ సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను.). గత పోరాటాలను, త్యాగాలను న్యాయబద్ధంగా స్వీకరిస్తే తప్పులేదు. కానీ, రాజకీయ కుట్రతో పోరాట స్వరూపాన్ని వక్రీకరించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తప్పు. మతం పేరుతో ప్రజలను విడదీసి ఫాసిస్టు కార్పొరేట్ ఎజెండాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. వీటికి వ్యతిరేకంగా నేటి తెలంగాణ.. రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడాలి.
- కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే,
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు
పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచన 700 పదాలకు మించరాదు.
